ఏమని చెప్పను ఎందుకు ప్రేమించవంటే,

నన్ను నేను చదువుకునే నా ఏకాంతాన్ని
నువ్వు సొంతం చేసున్నావనా!

ఏ అందాన్ని చూసినా కూడా ఆశ్వాదించలేనంతగా
నీ సౌందర్యంతో నా కనులను ఆక్రమించావనా!!

గడిచిపోతున్న కాలాన్ని, కనులలో దాచుకున్న స్వప్నాలని కూడ మర్చిపోయేంతగా
నా అలోచనలలో ఒదిగిపోయావనా!!!

ఒంటరితనపు పంజరంలో దాగిన మనసుకి స్వేచ్చనిచ్చి
ప్రేమ ప్రపంచాన్ని పరిచయం చేశావనా!!!!

ఒక్కమాటలో చెప్పలంటే-

"రేపటి మన జీవితాన్ని చూశాను నీ కళ్ళలో,దాచి వుంచిన నా ప్రేమను చదివను నీ మనసులొ".

అందుకే "నేను నిన్ను ప్రేమిస్తున్నాను".



ముసుగుకప్పిన నీ మాటాల తెరచాటున,
బయటపడలేక బంధించబడ్డ భావం ప్రేమ కాదా?

తడి ఆరని నీ కనుపాపల మాటున,
మసకబారిన నా రూపం దాచుంచడం ప్రేమ కాదా?

ప్రేమలేదని చెప్పే నీ మాటలతో,
నీ పెదవి ఒణుకు ప్రేమ కాదా?

గెలవలేమని తెలిసి నీ గుండెదాటని,
కలువలేమని తెలిసి నా మనసు చేరని అనురాగం ప్రేమ కాదా?

తలిదండ్రులు మన ప్రేమకు కంచెలు వేస్తుంటే...

అది దాటిరాలేక దుఖంలో నీవు,
నిను చేరుకోలేక చేతకాని వాడిలా నేను......

జీవితాంతం ప్రేమలేని ప్రాణులుగా బ్రతికేద్దాం......


తెలియని ఆనందాలను పంచే నీ స్నేహపు హృదయం,
నా మదిలో చీకటిహృదయానికి ప్రేమను ప్రకాసింపజేసిన ఉదయం.

తెలియకుండానే నీ స్నేహంలో ప్రేమను ఆశ్వాదించడం మొదలుపెట్టను.
తెలియజేయలేక నీకు నా ప్రేమను, నా మనసులోనే మధనపడ్డాను.

గుండెలో నుండి జారే కన్నీళ్ళను నీ స్నేహపు ఆనందాభాష్పాలని ఇంకెన్నాళ్ళు చెప్పాలో,
పగిలిపోతున్న హృదయాన్ని అదిమిపెడుతూ పెదవిపై చిరునవ్వును ఇంకెన్నేళ్ళు పొందుపరచాలో.

నేస్తమా నీవే నా మనసులో నిండిన ప్రేమవని ఎలా తెలుపను.
స్నేహమా నీవే నా జీవిత సర్వస్వం అని ఎలా తెలియజేయను.

ప్రేమను తెలియజేసి స్నేహాన్ని వదులుకోలేక,
స్నేహమే అని మోసంచేస్తూ ప్రేమను దాచుకోలేక.

                                                                                          నీ.....



నా మనసు మధించి నీకు ప్రేమామృతం అందిస్తున్నా ఆస్వాదించలేవు,

నీ చెలిమి నా మనసుకు సంతృప్తి నివ్వడం లేదన్నా అనురాగాన్ని అందించలేవు,

నీ ఏకాంతంలో నా ఆలోచనలకి స్థానం కావాలి అన్న అర్దంచేసుకోలేవు,

నీ మాటలలో మాధుర్యం మనసు పంచేదై ఉండాలన్నా ఆలకించలేవు,

నీ పెదవిపై నవ్వుగా, నీ కనులలో కన్నీరుగా నేను ఉండాలన్నా అంగీకరించలేవు,

ప్రతి క్షణం నీకై, నీడై, నీవై నీతో వుంటాను అన్నా ఆలోచించలేవు,

నీ చేరువలోనే ఈ దూరాన్ని భరించలేనన్నా పట్టించుకోవు,

చివరికి నేను కార్చే ప్రతి కన్నీటి బొట్టుకి కారణం నీవేనని తెలుసుకోలేవు.







తెలవారుఝామున నీ కనుల గుమ్మం ముందు నిల్చొని
నీకు చిరునవ్వుతొ శుభోదయం తెలుపాలని.

నీవు నడిచే ప్రతిదారిలో నీ పాదాలు కందకుండా
నీకు పూలమార్గం వెయ్యాలని.

నీవు పొందే ప్రతి ఆనందంలో,
నీ చిరునవ్వునై నీ అధరాలపై నిలవాలని.

ఆలోచనలతో అలసిపోయిన నీ మనసుకి,
ఏకాంతంలో నేను జ్ఞాపకం కావాలని.

నా ఆలోచనలు మొదలైన మరుక్షణం,
నీ కనుపాపల నుండి జారే కన్నీరు నవ్వాలని.

అలసిపోయి నిదురించు వేళ,
నీకు ఆనందాలను అందించే కలగా మారాలని.

కనులనిండా కన్నీళ్ళతో,కలల నిండా ఆశలతో ఎదురుచూస్తున్నా,
కనీసం రేపైనా నా యీ భావాలని నీకు తెలుపాలని.






ఆవేదనో తెలియదు..... ఆనందమో తెలియదు......
ఒక్క సారిగా నీవు కనిపించగానే నా కన్నుల్లో కన్నీరు....

ఇన్నాళ్ళ విరహానికి విలువగానో !!
                          లేక                       
ఈనాటి కలయికకి కానుక గానో  !!

బాధో తెలియదు, భారమో తెలియదు.....
నీకు చెప్పుకోలేక నా ప్రేమ పడే బాధ........

మనసులో దాగలేకనో !!
              లేక              
పెదవి నుండి దాటలేకనో !!

మధురమో తెలియదు, మైకమో తెలియదు......
నువ్వు ప్రేమించావని చెప్పగానే నా గుండె నిండిన అనుభూతి..

నీ మాట చినుకులు నా మనసులో ముత్యాలైనట్లు గానో !
                                              లేక                                         
నీ పెదవిమత్తులో మునిగిన పలుకులతో నా మనసుకి మైకం కమ్మినట్లో !!

నేను నచ్చలేదనో.... నిన్ను మరువలేకనొ....
నన్ను వదిలి నీ మనసులో చేరిపోయింది నా ప్రేమ....

తెలియని ఆనందం నీ మనసులో దొరికిందనో !
   లేక
స్వేఛ్చ నిండిన భానిసత్వం నీ గుండెల్లొ నిండి వుందనో !!




నా కనుల నుండి జారే కన్నీరు కాదు వేదనంటే,
కనుల ముందు నీవున్నా మనసుకి మనసుకి మద్య దూరమే వేదనంటే.

గుండెనిండా జ్ఞాపకాలు నింపుకోని బాధపడటం కాదు విరహమంటే,
జ్ఞాపకాలు గుండెనిండినా,నిజంలో నిమిషం కూడా చేరువకాకపోవడమే విరహమంటే.

నీవు దూరమై ఒంటరిగా బ్రతికేయడం కాదు వియోగమంటే,
ఎదురుగా నీవున్నా నిన్ను పొందలేక ఎడబాటులో నీకై ఎదురుచూడటమే వియోగమంటే.

 పెదవిదాక ప్రవహించి వెనుదిరిగే భావాల అలలు కాదు ప్రేమంటే,
ఇరుమనసుల మద్య పరవళ్ళు తొక్కే సంతోషాల ప్రవాహం ప్రేమంటే.



వర్షపు ఓడిలో,చినుకుల తడిలో,
ఒకటై నడుస్తూ,జతగా తడుస్తూ..

కదిలే గాజుల సవ్వడిలో,రాలే జాజుల ఒరవడిలో.
నా నడక తడబడితే,నువ్వు కనబడక మాయమైతే,

నీవు కానరాక నా కంటతడి,
అల్లంత దూరాన నా కంటపడి.

వర్షాన్ని చీల్చుకుంటూ నీవైపు నా అడుగులూ,
నిను తలచుకుంటూ కనబడని నా కన్నీళ్ళు

నీ చెంత చేరాకా,నా చింత తీరాక.
చినుకులన్నిటిని స్వాగతిస్తూ,నీ చేతికి కానుకిస్తూ.

నీ తోడులో.... వర్షం కురుస్తూ,కాలం కరుగుతూ,
ఆ వర్షంలో తడుస్తూ నీవు,నీ హర్షంలో తడుస్తూ నేను.....
(or)
ఆ వర్షంలో తడుస్తూ నీవు,నీ కౌగిలిలో కరిగిపోతు నేను....

(pls select the best one)


మరపుకురాని క్షణాలు,మదిలో మేలిమి జ్ఞాపకాలు.
 
 
 
నీకై వేచిచూసి విసిగిపోయిన నాలో....

"మదికి, బుద్దికి  మద్య విభేదాలు,
మనసుకి, మనిషికి మద్య వివాదాలు.

జ్ఞాపకాలకి, నిజాలకి మద్య వ్యత్యాసాలు,
నిన్నటికి, నేటికి మద్య ఆలోచనలు.

ప్రేమకి, స్నేహానికి మద్య పోలికలు,
అనురాగానికి, అనుబంధానికి మద్య తేడాలు.

నాలో నువ్వై ఆవేదనలు,
నాలో నవ్వై అమ్మానాన్నలు."

నీవిక చేరువ కావు,నవ్విక దూరం కాదు.
దక్కలేదని దుఖ్ఖం చెందను,అందలేదని అంతంచూడను.



నింగిలోని జాబిలై నీకందనని నవ్వుతుంటే,
నీటినై నీ ప్రతిబింబాన్ని గుండెలో దాచుకుంటూ ఆనందిస్తున్నా.

అందనంత దూరంలో ఒయాసిస్సులా నీవుంటే,
గుండెనిండా ఆశలను నింపుకుంటూ బ్రతికేస్తున్నా.

మనసు నిండ ప్రేమనుంచుకోని కురిపించలేని మేఘంలా నీవుంటే,
నీ జ్ఞాపకాల వేడిలో బీటలుబారిని హృదయంతో ఎదురుచూస్తున్నా.

సంతోషాలన్ని నీలోనింపుకొని సెలయేటిలా ప్రవహిస్తున్నా,
నిలువదని తెలిసినా నా ప్రేమతో ఆనకట్ట వేసి నిన్ను ఆపాలని ఆశిస్తున్నా.


ప్రతిక్షణం నీ విరహం, నీ కోపం  జ్ఞాపకలై నన్ను ఏడిపిస్తున్నా
ఆ జ్ఞాపకం మెదిలిన మరుక్షణం అన్ని మరచి మళ్ళీ నీ ప్రేమకోసం పరితపిస్తున్నా.






కనుచూపుకు కరువైనా,
కనుపాపవు నీవేగా!!

కనుపాపలో నీవున్నా,
తుది గమ్యం మనసేగా!!

ఇది పలికింది పెదవైనా,
తెలిపింది మనసేగా!!

ఆ మనసులే మౌనంగున్నా,
ప్రేమ పెదవంచునేగా!!

ఆ ప్రేమ నీవైన సమయానా,
ప్రతిక్షణం నీ నీడేగా,తుదిశ్వాసలో నీ తోడేగా!!







పదం పదం పరుగులందుకోని పుణ్యపాదాలను చేరాయి.
తెలుగు వెలుగులు తనకంటిచూపులో మిగిలిపోయాయి.

మాటరాని మౌనం ప్రతి గొంతును ఆక్రమించింది.
మనసు లేని కాలం ఆయన ప్రాణలతో ఉపక్రమించింది.

ప్రతి కవికి జీవం వేటూరి గేయం, ప్రతి గుండెకు తీరని కన్నీటి గాయం.
కవితకు ప్రాణం పోసే శైలి వేటూరిది, తెలుగుభాషకు తగిలిన వేటుఇది.






పుడమిని తడిపే స్వాతిచినుకు ఆనందమే,
చెలియ చూపుతో గుండెవణుకు ఆనందమే.

చిమ్మచీకటిలో మేలివెన్నెల అద్భుతమే.
మనసువాకిటిలో చెలివన్నెలు అద్భుతమే.

తడిమితడిపే సంధ్రపు అలలు అమోఘమే,
తట్టిలేపే సఖియ కలలు అమోఘమే.

కనులముందు కరిగిపోతున్న కాలం ఆనంతమే,
మనసులో నిండిపోతున్న కన్నీళ్ళు ఆనంతమే.

సెలయేటిపరవళ్ళకు దిశలన్ని ఆమోదమే.
నా మనసుకి నీ ప్రేమ ఘడియైనా ఆమోదమే.



నువ్వే నేననుకున్నా,
నా నవ్వే నువ్వనుకున్నా.

కనులకు కనబడకున్నా,
కన్నీటితో కనిబెడుతున్నా.

రాయబారమే వద్దనుకున్నా,
హృదయభారమే మోసేస్తున్నా.

విరహమై నను వేదిస్తున్నా.
దూరమై నిను గమనిస్తున్నా,

ఈ బంధం కలువదని తెలుస్తున్నా,
నీ ఆనందం చాలని బ్రతికేస్తున్నా. 


బాధపడినంతనే బంధం నిలువదురా!

వదులుకున్న దానికై వేదన వలదురా!

భామపైన కోపం బ్రతుకుమీద ఏలరా?

ప్రేమ పంచలేని ప్రతిమ మనకేలరా!

కన్నీటిని కాంచలేని రూపు కనుపాపలో ఏలరా?

మనసున్న మగువ మనద్దయ్యే రోజు ముందుందిరా!!



ఓ హృదయ మేఘమా, నా మనసు చూడుమా.

నీ ప్రేమ రాల్చుమా, నా ఎదను తడుపుమా.

దాహం తీరక,ఆశలు ఆవిరైపోతున్నాయి.

చూపులు తగలక, కన్నులు చీకటైపోతున్నాయి.

నా గుండెలో తడి నింపుమా, నీ చూపుల వెలుగు పంచుమా.

ఒంటరి కిరణాలలో మాడిపోతున్నా, చల్లగా నీ మాటలు కురిపించుమా.

తొలకరి ప్రేమకై ఎదురుచూస్తున్నా, నా ప్రేమకు జీవం పోయుమా.

ఎదతడికై ఎదురుచూస్తున్నా, కంటతడినే కానుకగా ఇవ్వకుమా.



బ్రతికేద్దాం... బ్రతికేద్దాం...
మనకెందుకులే అని బ్రతికేద్దాం.
మానవతను వదిలేద్దాం(1)

బ్రతుకు హీనమైపోతున్నా,
భవిత పాడైపోతున్న,
ప్రజలు చచ్చిపోతున్నా,
ప్రగతి పతనమవుతున్నా.

బ్రతికేద్దాం... బ్రతికేద్దాం...(2)

రాష్ట్రం రగిలిపోతున్నా,
బాంబులు పేలిపోతున్నా
హింస రేగిపోతున్నా,
ధరలు మండిపోతున్నా,

బ్రతికేద్దాం... బ్రతికేద్దాం....(3)

సిగ్గులేక బ్రతుకేద్దాం,
గోడమీది పిల్లిలా వ్యవహరిద్దాం.
మార్పు రాలేదని బాధపడదాం.
ఎదుటివారి మీద నిందలేద్దాం.

బ్రతికేద్దాం... బ్రతికేద్దాం....
బ్రతుకలేక బ్రతికేద్దాం.
స్వాతంత్రబానిసలుగా బ్రతికేద్దాం.

 
జీవితపాఠాలకు పునాది నా ఉగాది.



చేదు: ఇంకొకసారి చేయకూడని అనుభవం,

తీపి: మది నిండిన ఆనందం,

వగరు: గతం చేసిన గాయం,

పులుపు: జీవితం నేర్పిన గుణపాఠం,

ఉప్పు: మనకు ఇచ్చిన చనువుతనం,

కారం: తప్పు చూసినప్పుడు కోపం.


షడ్రుచుల సంగమం ఉగాది,

అదే నా జీవనప్రయాణానికి పునాది.



ఆమె ఎదురుపడింది.
గుండె వేగాన్ని పెంచేస్తూ,
కొత్త ప్రపంచానికి స్వాగతిస్తూ.

ఆమె పరిచయమయింది.
గతాన్నంతా చెరిపేస్తూ,
నాలో ప్రేమను గుర్తుచేస్తూ.

ఆమె కలిసిపోయింది.
ఊపిరై మనసులొకి చేరుతూ,
ఊహలై మదిలో తిరుగుతూ.

ఆమె కోపగించుకుంది.
నా ప్రేమను తిరస్కరిస్తూ,
నా మనసుకి గాయంచేస్తూ.

ఆమె వెళ్ళిపోతుంది.
నా ఆనందాలను మూటగట్టేస్తూ,
నా కన్నుల నిండా నీరు నింపేస్తూ.



ఏం మాయ చేసేవే నా గుండెకి,
నను వీడి చేరింది నీ గూటికి.

ఏం సోగసు చూపేవే నా కంటికి,
జగమంత నిను చూపింది నా చూపుకి.

ఏం మంత్రం వేశవే నా పెదవికి,
నీ పేరు తపిస్తుంది ప్రతి ఘడియకు.

ఏం ప్రేమ నిచ్చావే నా మనసుకి,
గతమంత తొలిచింది ఆ బరువుకి.

ఏం విరహం పంచావే నా ప్రేమకి,
నను ఒంటరిని చేసింది లోకానికి.





ఒంటరితనపు వెన్నెలలో మనసు వేదనతో వణుకుతుంటే,

చెలిమాటలు చలిమంటలై నునువెచ్చగ తాకుతుంటే,

అరుణమై అస్తమిస్తున్న ఆశ కూడ ఊపిరందుకోని ఉదయిస్తుంది.

శిదిలమై జారిపోతున్న సంతోషం కూడ పెదవిపై పదిలమవుతుంది.

ఇరుమనసుల సంగమంలో చిరునవ్వు చిగురిస్తుంది.

చెలివలపుల తాకిడితో మదిలో తొలిప్రేమ తుళ్ళి ఆడుతుంది.