తెలవారుఝామున నీ కనుల గుమ్మం ముందు నిల్చొని
నీకు చిరునవ్వుతొ శుభోదయం తెలుపాలని.

నీవు నడిచే ప్రతిదారిలో నీ పాదాలు కందకుండా
నీకు పూలమార్గం వెయ్యాలని.

నీవు పొందే ప్రతి ఆనందంలో,
నీ చిరునవ్వునై నీ అధరాలపై నిలవాలని.

ఆలోచనలతో అలసిపోయిన నీ మనసుకి,
ఏకాంతంలో నేను జ్ఞాపకం కావాలని.

నా ఆలోచనలు మొదలైన మరుక్షణం,
నీ కనుపాపల నుండి జారే కన్నీరు నవ్వాలని.

అలసిపోయి నిదురించు వేళ,
నీకు ఆనందాలను అందించే కలగా మారాలని.

కనులనిండా కన్నీళ్ళతో,కలల నిండా ఆశలతో ఎదురుచూస్తున్నా,
కనీసం రేపైనా నా యీ భావాలని నీకు తెలుపాలని.


ఆవేదనో తెలియదు..... ఆనందమో తెలియదు......
ఒక్క సారిగా నీవు కనిపించగానే నా కన్నుల్లో కన్నీరు....

ఇన్నాళ్ళ విరహానికి విలువగానో !!
                          లేక                       
ఈనాటి కలయికకి కానుక గానో  !!

బాధో తెలియదు, భారమో తెలియదు.....
నీకు చెప్పుకోలేక నా ప్రేమ పడే బాధ........

మనసులో దాగలేకనో !!
              లేక              
పెదవి నుండి దాటలేకనో !!

మధురమో తెలియదు, మైకమో తెలియదు......
నువ్వు ప్రేమించావని చెప్పగానే నా గుండె నిండిన అనుభూతి..

నీ మాట చినుకులు నా మనసులో ముత్యాలైనట్లు గానో !
                                              లేక                                         
నీ పెదవిమత్తులో మునిగిన పలుకులతో నా మనసుకి మైకం కమ్మినట్లో !!

నేను నచ్చలేదనో.... నిన్ను మరువలేకనొ....
నన్ను వదిలి నీ మనసులో చేరిపోయింది నా ప్రేమ....

తెలియని ఆనందం నీ మనసులో దొరికిందనో !
   లేక
స్వేఛ్చ నిండిన భానిసత్వం నీ గుండెల్లొ నిండి వుందనో !!
నా కనుల నుండి జారే కన్నీరు కాదు వేదనంటే,
కనుల ముందు నీవున్నా మనసుకి మనసుకి మద్య దూరమే వేదనంటే.

గుండెనిండా జ్ఞాపకాలు నింపుకోని బాధపడటం కాదు విరహమంటే,
జ్ఞాపకాలు గుండెనిండినా,నిజంలో నిమిషం కూడా చేరువకాకపోవడమే విరహమంటే.

నీవు దూరమై ఒంటరిగా బ్రతికేయడం కాదు వియోగమంటే,
ఎదురుగా నీవున్నా నిన్ను పొందలేక ఎడబాటులో నీకై ఎదురుచూడటమే వియోగమంటే.

 పెదవిదాక ప్రవహించి వెనుదిరిగే భావాల అలలు కాదు ప్రేమంటే,
ఇరుమనసుల మద్య పరవళ్ళు తొక్కే సంతోషాల ప్రవాహం ప్రేమంటే.