ఓ హృదయ మేఘమా, నా మనసు చూడుమా.

నీ ప్రేమ రాల్చుమా, నా ఎదను తడుపుమా.

దాహం తీరక,ఆశలు ఆవిరైపోతున్నాయి.

చూపులు తగలక, కన్నులు చీకటైపోతున్నాయి.

నా గుండెలో తడి నింపుమా, నీ చూపుల వెలుగు పంచుమా.

ఒంటరి కిరణాలలో మాడిపోతున్నా, చల్లగా నీ మాటలు కురిపించుమా.

తొలకరి ప్రేమకై ఎదురుచూస్తున్నా, నా ప్రేమకు జీవం పోయుమా.

ఎదతడికై ఎదురుచూస్తున్నా, కంటతడినే కానుకగా ఇవ్వకుమా.



బ్రతికేద్దాం... బ్రతికేద్దాం...
మనకెందుకులే అని బ్రతికేద్దాం.
మానవతను వదిలేద్దాం(1)

బ్రతుకు హీనమైపోతున్నా,
భవిత పాడైపోతున్న,
ప్రజలు చచ్చిపోతున్నా,
ప్రగతి పతనమవుతున్నా.

బ్రతికేద్దాం... బ్రతికేద్దాం...(2)

రాష్ట్రం రగిలిపోతున్నా,
బాంబులు పేలిపోతున్నా
హింస రేగిపోతున్నా,
ధరలు మండిపోతున్నా,

బ్రతికేద్దాం... బ్రతికేద్దాం....(3)

సిగ్గులేక బ్రతుకేద్దాం,
గోడమీది పిల్లిలా వ్యవహరిద్దాం.
మార్పు రాలేదని బాధపడదాం.
ఎదుటివారి మీద నిందలేద్దాం.

బ్రతికేద్దాం... బ్రతికేద్దాం....
బ్రతుకలేక బ్రతికేద్దాం.
స్వాతంత్రబానిసలుగా బ్రతికేద్దాం.

 
జీవితపాఠాలకు పునాది నా ఉగాది.



చేదు: ఇంకొకసారి చేయకూడని అనుభవం,

తీపి: మది నిండిన ఆనందం,

వగరు: గతం చేసిన గాయం,

పులుపు: జీవితం నేర్పిన గుణపాఠం,

ఉప్పు: మనకు ఇచ్చిన చనువుతనం,

కారం: తప్పు చూసినప్పుడు కోపం.


షడ్రుచుల సంగమం ఉగాది,

అదే నా జీవనప్రయాణానికి పునాది.



ఆమె ఎదురుపడింది.
గుండె వేగాన్ని పెంచేస్తూ,
కొత్త ప్రపంచానికి స్వాగతిస్తూ.

ఆమె పరిచయమయింది.
గతాన్నంతా చెరిపేస్తూ,
నాలో ప్రేమను గుర్తుచేస్తూ.

ఆమె కలిసిపోయింది.
ఊపిరై మనసులొకి చేరుతూ,
ఊహలై మదిలో తిరుగుతూ.

ఆమె కోపగించుకుంది.
నా ప్రేమను తిరస్కరిస్తూ,
నా మనసుకి గాయంచేస్తూ.

ఆమె వెళ్ళిపోతుంది.
నా ఆనందాలను మూటగట్టేస్తూ,
నా కన్నుల నిండా నీరు నింపేస్తూ.